పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా.. పాఠశాల/ కాలేజీ నిర్వహణ (అభివృద్ధి)కి రూ.2000 కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు.
తల్లికి వందనం పథకం అర్హతలు:
- దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
- విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి.
- ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు.
- విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి.
- విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి.
- ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు (పేదరిక రేఖకు దిగువన ఉండాలి).
తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం:
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.15000 జమ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది.
గత ప్రభుత్వంలో ‘అమ్మ ఒడి’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. దాదాపుగా అమ్మ ఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను తల్లికి వందనం పథకానికి అనుసరిస్తున్నామని.. ఈ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యార్థికి ఇచ్చే 15 వేల రూపాయల్లో పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2000 కట్ చేస్తారు. ఇక కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
తల్లికి వందనం పథకం ధరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు (తల్లి మరియు విద్యార్థి)
- తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు
- పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికెట్ (లేదా విద్యార్థి ప్రస్తుత పాఠశాల నుండి ధృవీకరణ)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- అడ్రస్ ప్రూఫ్
- విద్యార్థి హాజరు వివరాలు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (విద్యార్థి మరియు తల్లి)














